శతావధానం

ఆశీస్సులు – అభినందనలు


జగద్గురు

కుర్తాళం శంకరాచార్య,
విశాఖ శ్రీ లలితాపీఠాధిపతి,
జగద్గురు, పరమహంస పరివ్రాజకాచార్య
శ్రీ శ్రీ శ్రీ సిద్దేశ్వరానంద భారతీ మహాస్వామి వారు.చి. రాంభట్ల పార్వతీశ్వర శర్మ చేసిన అష్టావధానము, రూపక పాత్రధారణ, ప్రసంగాలు చూచి, విని పద్యావిద్యాసరస్వతికి ఇతడు చేసిన సేవను చూచి ఎంతో సంతోషిస్తున్నాను. సారస్వత రంగంలో ఇంకా ఇంకా పైకి రాగల గుణగణములు, వినయ సౌశీల్యాది లక్షణాలు సమృద్ధిగా ఉండటం చేత భవిష్యత్తు మరింత బాగుండగలదని ఆశిస్తున్నాను. ఇప్పుడు చేసిన శతావధానం ఒక ప్రారంభం మాత్రమే. సమస్యాపూరణలు మొదలైనవన్నీ ప్రశంసనీయంగా ఉన్నవి. పరమేశ్వరి ఇతనికి అభీష్టసిద్ధిని ప్రసాదించుగాక.

'సరస్వతీపుత్ర'

బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ ,
అవధాన సరస్వతీ పీఠం , హైదరాబాద్.ఉ|| నీదు శతావధానమున నిండిన పద్యములెల్ల చూచి ప్ర
హ్లాదనమందినాను; విషయమ్మును- చెప్పిన తీరు- శబ్దసం
పాదన- శైలి- ధార- ప్రతిభామయమై వెలిగొందె; నింకనున్‌
సాధనతో సమగ్రమగు సాహితిలోన సమర్థుడౌననన్‌!

“సరస్వతీపుత్ర;” “కవితాగంగోత్రి” , “అపూర్వ పంచసహస్రావధాన సార్వభౌమ”

డా. మేడసాని మోహన్‌ ,
తిరుపతి.ఆత్మీయులు, ప్రతిభామూర్తి శ్రీరాంభట్లపార్వతీశ్వర శర్మగారి శతావధాన పద్యాలు చదువుతూ ఉంటే ఆనందమకరందరసాస్వాదనం చేసినట్లనిపించింది. ధారా శుద్ధి, ప్రసన్నత, మంచి ఊహలపోహళింపు, సద్య:స్ఫురణ - ఇత్యాదిగా అవధానప్రతిభామూర్తికుండదగిన లక్షణాలన్నీ ఈ కవికి పుంజీభూతంగా, రక్తనిష్ఠమై ఉన్నాయి.


'' పద్యారంభములందు నెత్తుగడనుద్భాసించు అందాలు; రం
గద్యుక్తిన్‌ సుమనోహరంబయిన ముక్తాయింపులెన్నన్‌ భళీ!
హృద్యంబౌ అవధానవిద్య పదిలంబెంతేని నీబుద్ధి, వి
ద్వద్యోధాగ్రణి! పార్వతీశ్వరకవీంద్రా! నిన్‌ ప్రశంసించెదన్‌! ''

“మహాసహస్రావధాని”

డా. గరికిపాటి నరసింహారావు,
హైదరాబాద్.ప్రాణము పోయగా పరమపావనమైన వధాన విద్యకున్
ధ్యానము చేసి, పద్యములు ధారణజేసి శతావధానివై
రాణ తనిర్చితంట! యిదెరా యవధానమనంగ, తెన్గు మా
గాణము నేలగా తగు వికాసము నందుమ పార్వతీశ్వరా!!

"పద్య కళా తపస్వి"

ధూళిపాల మహాదేవమణి ,
రాజమహేంద్రవరం.అవధానామ్రపికీ నినాద గతితో నాహ్లాదమున్ పంచుచున్
కవితారమ్యవనీ విహార కరికిన్ కంఠీరవ ఖ్యాతివై
నవ భావంబులు, శబ్ద ధింధిములు విజ్ఞానాబ్ధి తారంగముల్
అవధానంబున పార్వతీశ్వరకవీ ఆద్యంతమున్ గూర్చితే!!

“ఆచార్య సార్వభౌమ”

వేదుల సుబ్రహ్మణ్యశాస్త్రి,
విశాఖపట్నం.శ్లో. ''శ్రీరాంభట్లకులాంభోధే: అవధాని సుధాకరమ్‌
పార్వతీశ్వరశర్మాణం పాయాద్వాణీ నిరంతరమ్‌''

21 నందీ పురస్కార విజేత, స్వర్ణకిరీట గ్రహీత

“సంగీతనవావధాని”
డా. మీగడ రామలింగస్వామి ,
విశాఖపట్నం.అవధానం చెయ్యడమే గొప్ప అనుకుంటే, శతావధానం చెయ్యడం చాలా గొప్ప. ఎంతో సాధన, ప్రతిభ, ధారణ మొదలగు అంశాలు ఉంటేనే గాని సాధ్యపడని విశిష్ట ప్రక్రియ. అలాంటి విశిష్టప్రక్రియను అతి పిన్న వయస్సు(26)లో మన శర్మ చేయడం, కృతకృత్యుడు కావడం నాకు ముఖ్యంగా చాలా ఆనందదాయకం.


''శర్మ! అక్షర శిల్పుల చలువతోడ
దేశ దేశాల నీకీర్తి తిరుగుగాక!!
శతశతావధానాలతో సాగుగాక!!
తెలుగు వెలుగుతో నీప్రభ వెలుగుగాక!''