రేడియో రంగం

రాంభట్ల రేడియో ప్రస్థానం


శ్రీ రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారికి చిన్నప్పటినుండే రేడియో అంటే వల్లమాలిన మమకారం. ఇది కూడా పితామహుడి వారసత్వమే. తాతగారు రాంభట్ల పార్వతీశ్వరశర్మ గారు రేడియో నాటికిలు, బుర్రకథ, హరికథలు, ఏకాపాత్రాభినయాలు మొదలయినవి రాశారు.


యువవాణి కార్యక్రమంలో కేవలం శ్రోతగ ఫోనులోనే ఆశుకవితలు వినిపిస్తూ రేడియో అంటే మక్కువపెంచుకున్న పార్వతీశ్వరశర్మ, కళాశాల ద్వారా కదంబకార్యక్రమంలో పాలుపంచుకున్నారు. డిగ్రీ చదువుతున్నప్పుడే ఆకాశవాణి విశాఖపట్నం వారి “FM రెయిన్ బో 102” లో ప్రతి శనివారం యువతకోసం ప్రత్యేకంగా ప్రసారమయ్యే “Joy – Enjoy” కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఆలోచింపజేసే అంశాలతో యువతను ఆకట్టుకున్నారు.


“అవధానం – అవగాహన” పేరిట ఆకాశవాణిలో తొలిప్రసంగాన్ని చేసారు. తరువాత వివిధ అంశాలగూర్చి ఎన్నోసార్లు విశ్లేషణాత్మకత్మంగా ప్రసంగించారు.


2009వ సంవత్సరంలో ఆకాశవాణి విశాఖపట్నంలో “FM రెయిన్ బో 102” లో పూర్తిస్థాయి కార్యక్రమాలు నిర్వహించడానికి “రేడియోజాకీ” (RJ) గా స్వరపరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. రేడియోవ్యాఖ్యాతలకు కేంద్రప్రభుత్వం నిర్వహించే శిక్షణ కార్యక్రమం “వాణి” కోర్సులో సుశిక్షుతులై RJ గా “Vizag FM రెయిన్ బో 102” లో ఆధ్యాత్మిక, ఆలోచనాత్మక, ప్రేరణాత్మక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సినీప్రముఖులతోనూ, వివిధ రంగాల దిగ్గజాలతోనూ వీరు నిర్వహించిన “పరిచయ కార్యక్రమాలు” అజరామరాలు.


ఆకాశవాణి, విశాఖపట్నం కేంద్రంలో నాటక విభాగంలోనూ వీరికి అభినివేశముంది. “B Grade” నాటక కళాకారులుగా ఎన్నో పాత్రల్లో వివిధ పౌరాణిక, సాంఘిక నాటకాల్లో వీరి గళాన్ని వినిపించారు. “Vizag FM రెయిన్ బో 102” లో స్వయంగా కొన్ని హాస్య నాటికలకు రచనా సహకారం అందించారు. ప్రత్యేక కార్యక్రమాలుగా వివిధ సందర్భాల్లో ఇవి ప్రసారమయ్యాయి.


రేడియో సాంగత్యంలో మరచిపోలేని మైలురాయి “కవనవిజయం” పేరుతో నిర్వహించే “సమస్యాపూరణం” కార్యక్రమ నిర్వహణ. ఇది పక్షానికొక సారి ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఔత్సాహిక పద్యకవులకోసం నిర్వహిస్తున్న ప్రత్యేకకార్యక్రమం. రేడియోలో నిర్వాహకుడు ఇచ్చే సమస్య, దత్తపది, లేదా వర్ణనను శ్రోతలు ఉత్తరాలద్వారా పూరించి పంపుతారు. ఆ పూరణలను చదువుతూ, తిరిగి వచ్చే పక్షానికి ఒక సమస్యను ఈ కార్యక్రమంలో ఇవ్వడం పరిపాటి. చాలా ప్రతిష్టాత్మకమైన ఈ కార్యక్రమాన్ని వీరి పితామహులు పార్వతీశ్వర శర్మగారు ఎన్నో సంవత్సరాలు నిర్వహించారు. తాతగారి మార్గదర్శకత్వంలో అందిపుచ్చుకున్న ఆస్తిగా “సమస్యాపూరణం” కార్యక్రమాన్ని నిర్వహించడం ప్రారంభించి, విశేషమైన అంశాలతో పద్యశ్రోతలను రంజింపజేస్తున్నారు.


ఇందిరాగాంధి సార్వత్రిక విశ్వవిద్యాలయం (IGNOU) వారు ప్రమాణాత్మక విద్యకోసం, అభివృద్ధికోసం వివిధ స్థాయిల విద్యార్థుల ప్రయోజనంకోసం నడుపుతున్న 101.4 Mhz FM - “జ్ఞానవాణి” ఇందులో ఎన్నో వైజ్ఞానికకార్యక్రమాలు ప్రత్యక్షప్రసారాలవుతుంటాయి. అదే పంథాలో శ్రీ పార్వతీశ్వరశర్మ గారు ప్రసంగాలు చేసారు. కొన్ని “ముఖాముఖి” కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ కార్యక్రమాల వివరాలు ఇదిగో.


“అవధానం – అవగాహన” (ఉగాది సం|| గా) - జ్ఞానవాణి ఎఫ్‌.ఎం - ముఖాముఖి – 2012.


'సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు’ - శతజయంత్యుత్సవం -జ్ఞానవాణి ఎఫ్‌.ఎం. – 2013. 'రాయప్రోలు రచనలు - జీవితం’ - రాయప్రోలు సుబ్బారావు వర్థంతి -జ్ఞానవాణి ఎఫ్‌.ఎం. – 2013.


'భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు’ - వారసత్వసంపద దినోత్సవం -జ్ఞానవాణి ఎఫ్‌.ఎం. – 2013.


'వసంతకేళి - హోళి’ - జ్ఞానవాణి ఎఫ్‌.ఎం. – 2014.

 

సాహిత్యజగత్తులో చిరస్థాయిగా నిలిచిపోయే కార్యక్రమం FM రేడియో అష్టావధానం. రేడియోలో అవధానాన్ని ప్రముఖులు చేసినట్టు దాఖాలాలున్నాయి. కానీ FM చరిత్రలో మొదటి అష్టావధానంగా చెప్పుకోదగ్గ కార్యక్రమం ఈ 101.4 Mhz FM - “జ్ఞానవాణి” అష్టావధానం. 29/08/2012 నాడు ఈ అవధాన సభ ’పండిత’ నేమాని రామజోగి సన్యాసిరావుగారి సంచాలకత్వంలో, శ్రీమతి బి.టి. కృష్ణకుమారిగారి పర్యవేక్షణలో జరిగింది. యువపద్యకవులు ఇందులో పృచ్ఛకత్వాన్ని పోషించారు.


 

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వారి నిర్వహణలో “జానపద సంబరాలు” 2012 మార్చి నెలలో జరిగిన ప్రతిష్టాత్మక కార్యక్రమంలో శ్రీపార్వతీశ్వర శర్మ ప్రధాన వ్యాఖ్యాతగా వ్యవహరించి చూపరులను అలరించారు. వివిధ జానపద కళారీతుల్ని ప్రదర్శించిన ఈ కార్యక్రమంలో ప్రతి అంశానికి సంబంధించిన విశేషమైన వ్యాఖ్యానాన్ని అందించి ఆకట్టుకున్నారు.