సమస్యా పూరణ పద్యాలు

తేది: 20-05-2007.


బ్రాహ్మణ సమాజం - ఆనంద్ భాగ్ శంకరమఠం, మల్కాజిగిరి, హైదరాబాద్.

 

సమస్య:
కపిని వరించి పార్వతి సుఖంబుల రెంటిని కూర్పగావలెన్!!

 

పూరణ: రిపుల జయించె రాము డవలీలగనేవిధి నాచరించుటన్!
కృపగొని భార్యయై శివుని కీర్తిని పెంచిన నాతి యెవ్వరో!
అపి, జనులేమికోరుదురు! ఐదది యేడగునెత్తెరుంగునన్!!
కపిని వరించి, పార్వతి, సుఖంబుల, రెంటినికూర్పగా - వలెన్!!

 

దత్తపది : గాయత్రి, ధరిత్రి, సావిత్రి, సుధాత్రి - విశ్వశాంతి.

 

పూరణ: లేదు సఖ్యత జూడ ధరితిలోన
హింస సావిత్రి పట్టుగా హెచ్చెనమ్మ!
కరుణతోజూచి గాయత్రి కాచు గాత
దేశముల నెల్లను ధాత్రి దేవి వగుచు!!

 

వర్ణన: వసంత ఋతు వర్ణన , మత్తకోకిల వృత్తంలో.
పూరణ: మత్తకోకిల కూయుచుండును మావికొమ్మల మాటునన్
చిత్తముల్ విరబూయు రీతిని చెట్లవే చిగురింపగన్!
క్రొత్తవత్సరమాదియౌనది కోరిదెచ్చును సంపదల్!
మత్తకోకిల జెప్పసాధ్యమె! మా వసంతుని శోభలన్!!

 

నిషిద్ధాక్షరి: శంకరాచార్యస్తుతి.


పూరణ: ఆహా మీరల్ నాదౌ
దేహంబున చేరిరొక్కొ? ధీవై స్వామీ
యూహింపని రీతిగ నే
సాహసముంజేయనుంటి శంకర వరదా!!

 

న్యస్తాక్షరి:
1 పా ॓4వ అక్షరం - రా 2వ పా ॓13వ అక్షరం - మా
3వ పా ॓9వ అక్షరం- య 4వ పా ॓16వ అక్షరం - ణం

 

పూరణ:
చేరి మురారి, నీదు పదసీమను నా తలనుంచి మ్రొక్కెదన్
ఏరికినైన దైవమని, ‘హే!పమాత్మ‘ యటంచుగొల్చెదన్!
వారిదమీవు నాదు భయపావకమున్ తొలగించివేయగా
కోరెద కృష్ణమూర్తి నిను కూర్మిని! దేవగణంp శ్రేష్ఠుడా!!


 

Back to mainpage



ప్రార్థన:

అజహరి రుద్రాదులకున్
భజన సులభుడైన వేల్పు వరదాయకునిన్
గజవక్తృ సంస్మరింతును
నిజ భక్తిన్ సర్వకార్య నిర్విఘ్నతకున్

 

వరవీణా మృదుపాణి! నీ చరణ సేవా భాగ్యమే గోరుదున్!
ధరలో నే కవి కైత చెప్పుటకు నీ దాక్షిణ్యమే దిక్కగున్!
స్వరమై నీ వెద నిల్చినన్ ! గళము తా పల్కున్ గదా శారదా!
స్థిరమోదంబిడి బ్రోచి ! నా ప్రతిభ నుద్దీపింపగా చేయుమా!

 

వాణీ నీ దయ లేని నాడు జగతిన్ వాక్సూనముల్ విచ్చునే
వీణా పాణి వినోద నాద చయ సంవిత్సంపదాశ్రేణి గీ
ర్వాణీ మ్రొక్కెద సర్వ శాస్త్ర జననీ వాగ్దాయినీ బ్రోచి బ్ర
హ్మాణీ పల్కుల రాణి సంతతము జిహ్వాగ్రమ్మునన్నిల్వుమా!!

 

వాణికి, నాది నీరజ భవాంచిత రాజ్ఞికి, స్తుత్య నిత్య గీ
ర్వాణ సమాన మానధన పండితషండ రసజ్ఞ సంవృత
శ్రేణికి, ధాతృ మానస వశీకరణాద్భుత కాచ్ఛపేయ ని
క్వాణ వినోదికిన్, కమల పావన పీఠికి నంజలించెదన్

 

పంచ ముఖంబులన్వెలసి భక్తుల బ్రోచెడు వేదమాత నీ
పంచ్అను చేరి వేడెదను పాదములన్ విడనింక దేవి నే
నెంచితి నీవ దైవముగ నేమని చెప్పుదు నీదు శక్తి రా
యంచయె వాహనమ్ముగ మదార్తిని దీర్చు మదంబరో నతుల్!

 

కలనైనన్ నిను మరువక
తలతుము రాంభట్ల వంశ దైవమ! సతమున్
నిలకడతో మము గాంచెడి
యిలువేలుపు వేంకమాంబ నెద ప్రార్థింతున్!!

 

రాంభట్లాన్వయ కీర్తి కేతనమునాన్ రాజిల్లె ముత్తాత, మా
కంభోజాక్షుని భంగి, సద్యశము దా నార్జించె, తద్భిక్షగా
నంభోజాసను భామినిం గొలువ శక్త్యాసక్తి నా కబ్బెనే
సంభావింతును వేంకటార్యుని మదిన్! సత్యమ్ము! నిత్యమ్ముగా!!