సమస్యా పూరణ పద్యాలు

తేది: 25-02-2007.


విజయభావన శ్రీ మహారాజా సంగీత కలశాల, విజయనగరము

 

విజయభావన భావనా విభవమందు
నాదు అష్టావధానమ్ము పాదు గొల్పి
ధన్యతను గూర్చితే పైడితల్లి వేల్ప!
విజయమొసగుము ప్రార్థింతు వినయ మొప్ప!!

 

సప్తమావధానమందు సంస్తుతింతునయ్య! సం
దీప్త భావనా విశేష దివ్య పద్య మాధురిన్
ఆప్తులై యొసంగుడయ్య ! యాశిసు ల్సభాసదుల్
ప్రాప్తిలింగ చేయునవియె బాల వాగ్జయమ్మిటన్!!

 

సమస్య :
పుష్టికి తుష్టికిన్‌నరులు పుర్వుల మందులువాడ మేలగున్!

 

పూరణ:
ఇష్టముతోడ పంటలను యేపుగపెంచెడి వారలెల్లరిన్
కష్టపడంగ జేసెడివి కానగ చీడల రూపుమాపగన్
పుష్టికితుష్టికిన్ నరులు పుర్వుల మందులువాడ మేలగున్!
నష్ట వినాశ కారకము నవ్యతగల్గిన తీరుతెన్నులన్!!

 

దత్తపది: అమ్మ , కొమ్మ , నిమ్మ , బొమ్మ స్వార్థ త్యాగంతో (భాగవతార్ధములో)

 

పూరణ: అమ్మణి కొఱకు శ్రీకృష్ణు డడవిలోన
కొమ్మ టున దాగిన గుహను జొచ్చి,
పోరునన్ జాంబవంతుని బొమ్మళించి,
కొమ్మ నిమ్మని మణితోడ, కోరె వలచి.

 

వర్ణన: క్రికెట్టు, ఎన్నికలు, శివరాత్రి కోలాహలముతో కూడిన
విశాఖ వర్ణన.

 

పూరణ: ఏమని చెప్పెదనమ్మా?
ప్రాముఖ్యత గల్గె బ్యాటుబంతాటలకున్;
నామంబున కెన్నికలకు;
కామాంతకు తీర్థములకు - గనగ విశాఖన్!!

 

నిషిద్ధాక్షరి: అర్థనారీశ్వర తత్త్వము గూర్చి.

 

పూరణ: నాదౌ తరమొక్కో? శ్రీ
మోదంబున్ చేర్చునట్టి మూలపుటమ్మా!
పాదంబుల సేవించెద
భేదములేనట్టి యాది వేల్పులు మీరే!!

 

న్యస్తాక్షరి: శారదాంబ స్తోత్రం

1వ పా ॓11వ అక్షరం - గా 2వ పా ॓4వ అక్షరం - ర
3వ పా ॓15వ అక్షరం - బు 4వ పా ॓21వ అక్షరం - దా

 

పూరణ:
కనగను శారదాంబ నను గాచెడి తల్లిగనెంతునెమ్మదిన్!
మన వరదాయినిన్ తలచి మాతలవేలుపు నంజలించెదన్!!
తనయుల మమ్మ నీదుదరి , తల్లివిగా బుధరాశికైన , మా
మనముల నిల్చి, మమ్ములను మాన్యులజేయుము మాతశారదా!


 

Back to mainpage



ప్రార్థన:

అజహరి రుద్రాదులకున్
భజన సులభుడైన వేల్పు వరదాయకునిన్
గజవక్తృ సంస్మరింతును
నిజ భక్తిన్ సర్వకార్య నిర్విఘ్నతకున్

 

వరవీణా మృదుపాణి! నీ చరణ సేవా భాగ్యమే గోరుదున్!
ధరలో నే కవి కైత చెప్పుటకు నీ దాక్షిణ్యమే దిక్కగున్!
స్వరమై నీ వెద నిల్చినన్ ! గళము తా పల్కున్ గదా శారదా!
స్థిరమోదంబిడి బ్రోచి ! నా ప్రతిభ నుద్దీపింపగా చేయుమా!

 

వాణీ నీ దయ లేని నాడు జగతిన్ వాక్సూనముల్ విచ్చునే
వీణా పాణి వినోద నాద చయ సంవిత్సంపదాశ్రేణి గీ
ర్వాణీ మ్రొక్కెద సర్వ శాస్త్ర జననీ వాగ్దాయినీ బ్రోచి బ్ర
హ్మాణీ పల్కుల రాణి సంతతము జిహ్వాగ్రమ్మునన్నిల్వుమా!!

 

వాణికి, నాది నీరజ భవాంచిత రాజ్ఞికి, స్తుత్య నిత్య గీ
ర్వాణ సమాన మానధన పండితషండ రసజ్ఞ సంవృత
శ్రేణికి, ధాతృ మానస వశీకరణాద్భుత కాచ్ఛపేయ ని
క్వాణ వినోదికిన్, కమల పావన పీఠికి నంజలించెదన్

 

పంచ ముఖంబులన్వెలసి భక్తుల బ్రోచెడు వేదమాత నీ
పంచ్అను చేరి వేడెదను పాదములన్ విడనింక దేవి నే
నెంచితి నీవ దైవముగ నేమని చెప్పుదు నీదు శక్తి రా
యంచయె వాహనమ్ముగ మదార్తిని దీర్చు మదంబరో నతుల్!

 

కలనైనన్ నిను మరువక
తలతుము రాంభట్ల వంశ దైవమ! సతమున్
నిలకడతో మము గాంచెడి
యిలువేలుపు వేంకమాంబ నెద ప్రార్థింతున్!!

 

రాంభట్లాన్వయ కీర్తి కేతనమునాన్ రాజిల్లె ముత్తాత, మా
కంభోజాక్షుని భంగి, సద్యశము దా నార్జించె, తద్భిక్షగా
నంభోజాసను భామినిం గొలువ శక్త్యాసక్తి నా కబ్బెనే
సంభావింతును వేంకటార్యుని మదిన్! సత్యమ్ము! నిత్యమ్ముగా!!