సమస్యా పూరణ పద్యాలు

తేది: 20-11-2006.


అక్షరలక్ష గాయత్రీ మంత్ర జప పరిసమాప్తి - పూర్ణాహుతి స్వగృహంనందు, చినముషిడివాడ, విశాఖపట్టణము

 

సమస్య:
కృష్ణను చూచినంతటనె కృష్ణగళమ్మ సుధాంశువయ్యెగా!


పూరణ:
విష్ణువె దైవమంచు మరి విందునుజేయగ వేచియుంటినే
కృష్ణుడవైనరాముడవొ! యేదగు రూపున నన్నుబ్రోతువో!
కృష్ణుని వేషధారి! ఘనుడీతడు “మీగడరామలింగ” డీ
కృష్ణను చూచినంతటనె కృష్ణగళమ్మ సుధాంశువయ్యెగా!

 

దత్తపది: కింక, వంక, లంక, జింక మహాభారతార్థంలో.


పూరణ :
కింకంబెట్టిరి బాలురంత మరియా కేళిన్ విరుద్ధంబుగా
వంకల్జూసిరి బావిలోన పడనా బంతిన్వడిందీయగా!
లంకా! కాదిది, మాయజేయదగునా! రాదంచుద్రోణుండు, దా
జింకంగొట్టెడు బాణముంగొనుటచే, జిక్కెంగదా చేతికిన్!!

 

వర్ణన : విశాఖ పురవర్ణన


పూరణ: ఏమని చెప్పుదునమ్మా!
ధీమంతుల నిలయమమ్మ! తెలుసో, లేదో!
నామంబది వైశాఖము
మేమెంచిన పురము సుమ్మ! మేల్కనుమమ్మా!


నిషిద్ధాక్షరి : తెలుగు భాష విశిష్టత
అమ్మా మాదౌ మదులన్
కమ్మని నీ సౌమ్యమైత్రి కాచున్ మరియా
నెమ్మది భాషన తెలుగే
నమ్మని వారెవరు తెలుగు నాటన్ చెపుమా!

 

న్యస్తాక్షరి:

1వ పాదం 5 వ అక్షరం - తా 2వ పాదం 16 వ అక్షరం -త
3వ పాదం 11 వ అక్షరం - గా 4వ పాదం 2 వ అక్షరం రు
(ఆధునిక వైద్య విధానము గురించి)


పూరణ:
పరుడగు తానెయన్న తన ప్రాణములన్ నిలబెట్టువాడు, యే
వెఱపది లేదు వైద్యునకు! వేదము భారత దేశ మందునన్!
కరగును నిల్వయౌ ధనము గారవ వైద్యుల చేతలందునన్
తరుణము యుండదే నిజము! దానము నీవలె డబ్బు కొల్లగన్!!

 

Back to mainpage



ప్రార్థన:

అజహరి రుద్రాదులకున్
భజన సులభుడైన వేల్పు వరదాయకునిన్
గజవక్తృ సంస్మరింతును
నిజ భక్తిన్ సర్వకార్య నిర్విఘ్నతకున్

 

వరవీణా మృదుపాణి! నీ చరణ సేవా భాగ్యమే గోరుదున్!
ధరలో నే కవి కైత చెప్పుటకు నీ దాక్షిణ్యమే దిక్కగున్!
స్వరమై నీ వెద నిల్చినన్ ! గళము తా పల్కున్ గదా శారదా!
స్థిరమోదంబిడి బ్రోచి ! నా ప్రతిభ నుద్దీపింపగా చేయుమా!

 

వాణీ నీ దయ లేని నాడు జగతిన్ వాక్సూనముల్ విచ్చునే
వీణా పాణి వినోద నాద చయ సంవిత్సంపదాశ్రేణి గీ
ర్వాణీ మ్రొక్కెద సర్వ శాస్త్ర జననీ వాగ్దాయినీ బ్రోచి బ్ర
హ్మాణీ పల్కుల రాణి సంతతము జిహ్వాగ్రమ్మునన్నిల్వుమా!!

 

వాణికి, నాది నీరజ భవాంచిత రాజ్ఞికి, స్తుత్య నిత్య గీ
ర్వాణ సమాన మానధన పండితషండ రసజ్ఞ సంవృత
శ్రేణికి, ధాతృ మానస వశీకరణాద్భుత కాచ్ఛపేయ ని
క్వాణ వినోదికిన్, కమల పావన పీఠికి నంజలించెదన్

 

పంచ ముఖంబులన్వెలసి భక్తుల బ్రోచెడు వేదమాత నీ
పంచ్అను చేరి వేడెదను పాదములన్ విడనింక దేవి నే
నెంచితి నీవ దైవముగ నేమని చెప్పుదు నీదు శక్తి రా
యంచయె వాహనమ్ముగ మదార్తిని దీర్చు మదంబరో నతుల్!

 

కలనైనన్ నిను మరువక
తలతుము రాంభట్ల వంశ దైవమ! సతమున్
నిలకడతో మము గాంచెడి
యిలువేలుపు వేంకమాంబ నెద ప్రార్థింతున్!!

 

రాంభట్లాన్వయ కీర్తి కేతనమునాన్ రాజిల్లె ముత్తాత, మా
కంభోజాక్షుని భంగి, సద్యశము దా నార్జించె, తద్భిక్షగా
నంభోజాసను భామినిం గొలువ శక్త్యాసక్తి నా కబ్బెనే
సంభావింతును వేంకటార్యుని మదిన్! సత్యమ్ము! నిత్యమ్ముగా!!