సమస్యా పూరణ పద్యాలు

తేది: 15-07-2010.


శ్రీకృష్ణదేవరాయలు పట్టాభిషేక పంచశతాబ్ద్యుత్సవ సభ డా|| వి.యస్.కృష్ణా ప్రభుత్వ డిగ్రీ కళాశాల,
మద్దిలపాలెం, విశాఖపట్టణము.

 

సమస్య: కుంజర యూధంబు దోమ కుత్తుకజొచ్చెన్

 

పూరణ:
రంజింప చలన చిత్ర చి
రంజీవియె రాజకీయ లంపటుడగుచున్!
భంజితుడయ్యెన్, చూడగ -
కుంజర యూధంబు దోమ కుత్తుకజొచ్చెన్!

 

దత్తపది: శ్రియ, ప్రియ, నయన, అనుష్క -
కృష్ణ దేవరాయల ఆస్థాన వర్ణన.

 

పూరణ:

శ్రియంగూర్చు మదాంధ్రభోజు కొలువున్, శ్రీరమ్యమౌ రీతిగా
ప్రియరంగ కవిత్వ తత్త్వ ఘనులన్ పేరోలగంబొప్పదే
నయనానందకరంబు, శ్రోతృ హితమై నాడుండెనుత్కృష్టతన్
దయనీయంబగు నెల్ల స్వీయ కవితన్ ధానుష్కులౌ స్పర్థతో!

 

వర్ణన : కృష్ణ దేవరాయలు - సాహితీ సమరాంగణా సార్వభౌముడు.

 

ఎవ్వడు సాటిరా గలడు కృష్ణ మహీవిభు వైభవోన్నతిన్
పువ్వులు పూయునట్టి క్రియ పూచె ప్రబంధ కవిత్వ సంతతుల్
“రవ్వ”గు గాదె ధాత్రి చతురంగ బలాఢ్యుడు రాయలేంద్రుడే!
అవ్వగు తెన్గు తల్లి కిల నాత్మజుడయ్యెను కీర్తి కాయుడై!!

 

నిషిద్ధాక్షరి: భువన విజయ సభను హంపినగరంలో ప్రదర్శిస్తే, రాయల వారి స్పందనను ఊహించి చెప్పాలి.

 

ఆహా! యీ కవి యుతమౌ
మోహిని గా కొండు భూమి మోదంబగునే
దేహంబుబ్బును, రాయల
గేహంబున “భువన విజయ” కీర్తి గనంగా!

 

న్యస్తాక్షరి: 1వ పాదం 4వ అక్షరం - డు

2వ పాదం 5వ అక్షరం - ము
3వ పాదం 7వ అక్షరం - వు
4వ పాదం 10వ అక్షరం - లు


అంశము: అష్టదిగ్గజముల ప్రశస్తి.


చేరరాడు కవీశుడెవ్వడు చిత్రమట్లు సభాస్థలిన్
సారమెంచ దంబునందడు సాగరంబగు సాహితిన్
కారణంబగు భాకుల్ - నిజకావ్య తత్త్వవిశారదుల్
చేరుటన్ కవి దిగ్గజమ్ములు శ్రీమహీపతి చెంగటన్!!


 

Back to mainpage



ప్రార్థన:

అజహరి రుద్రాదులకున్
భజన సులభుడైన వేల్పు వరదాయకునిన్
గజవక్తృ సంస్మరింతును
నిజ భక్తిన్ సర్వకార్య నిర్విఘ్నతకున్

 

వరవీణా మృదుపాణి! నీ చరణ సేవా భాగ్యమే గోరుదున్!
ధరలో నే కవి కైత చెప్పుటకు నీ దాక్షిణ్యమే దిక్కగున్!
స్వరమై నీ వెద నిల్చినన్ ! గళము తా పల్కున్ గదా శారదా!
స్థిరమోదంబిడి బ్రోచి ! నా ప్రతిభ నుద్దీపింపగా చేయుమా!

 

వాణీ నీ దయ లేని నాడు జగతిన్ వాక్సూనముల్ విచ్చునే
వీణా పాణి వినోద నాద చయ సంవిత్సంపదాశ్రేణి గీ
ర్వాణీ మ్రొక్కెద సర్వ శాస్త్ర జననీ వాగ్దాయినీ బ్రోచి బ్ర
హ్మాణీ పల్కుల రాణి సంతతము జిహ్వాగ్రమ్మునన్నిల్వుమా!!

 

వాణికి, నాది నీరజ భవాంచిత రాజ్ఞికి, స్తుత్య నిత్య గీ
ర్వాణ సమాన మానధన పండితషండ రసజ్ఞ సంవృత
శ్రేణికి, ధాతృ మానస వశీకరణాద్భుత కాచ్ఛపేయ ని
క్వాణ వినోదికిన్, కమల పావన పీఠికి నంజలించెదన్

 

పంచ ముఖంబులన్వెలసి భక్తుల బ్రోచెడు వేదమాత నీ
పంచ్అను చేరి వేడెదను పాదములన్ విడనింక దేవి నే
నెంచితి నీవ దైవముగ నేమని చెప్పుదు నీదు శక్తి రా
యంచయె వాహనమ్ముగ మదార్తిని దీర్చు మదంబరో నతుల్!

 

కలనైనన్ నిను మరువక
తలతుము రాంభట్ల వంశ దైవమ! సతమున్
నిలకడతో మము గాంచెడి
యిలువేలుపు వేంకమాంబ నెద ప్రార్థింతున్!!

 

రాంభట్లాన్వయ కీర్తి కేతనమునాన్ రాజిల్లె ముత్తాత, మా
కంభోజాక్షుని భంగి, సద్యశము దా నార్జించె, తద్భిక్షగా
నంభోజాసను భామినిం గొలువ శక్త్యాసక్తి నా కబ్బెనే
సంభావింతును వేంకటార్యుని మదిన్! సత్యమ్ము! నిత్యమ్ముగా!!